APTELANGANA

ఏకంగా 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‍ చోరీ.. ఎలా బయటపడిందంటే!

ఆశ్చర్యపరిచేలా ఓ వెరైటీ దొంగతనం జరిగింది. ఏకంగా 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ (Railway Track Stolen) చోరీకి గురైంది. అంటే రైలు పట్టాలనే దొంగలు ఎత్తుకుపోయారు. మొత్తంగా రైల్వే ట్రాక్‍నే మాయం చేశారు. బిహార్‌ (Bihar) లోని సమస్తిపూర్‌(Samastipur)లో ఇది జరిగింది. మొబైల్ సిగ్నల్ టవర్లు, బ్రిడ్జిల వస్తువులు చోరీ జరిగిన ఘటనలు గతంలో జరుగగా.. ఇప్పుడు ఏకంగా కిలోమీటర్ల మేర రైలు పట్టాలే దొంగతనానికి గురయ్యాయి. ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఉద్యోగుల సస్పెన్షన్‍తో ఈ విషయం బయటికి వచ్చింది. ఆ ఇద్దరిపై ఉన్నతాధికారులు శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు. పూర్తి వివరాలు ఇవే. రాకపోకలు లేకపోవటంతో.. Railway Track theft in Bihar: సమస్తిపూర్ జిల్లాలో ఈ రైల్వే ట్రాక్ చోరీ ఘటన జరిగింది. లోహత్ (Lohat) షుగర్ మిల్లు, పాండువల్ (Pandual) రైల్వే స్టేషన్‍ను కలుపుతూ ఈ రైలు పట్టాలు ఉండేవి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆ చక్కెర మిల్లు మూతపడింది.

దీంతో ఆ రైలు పట్టాలపై రైళ్ల రాకపోకలు నిలిచిపోయి చాలా కాలం అయింది. దీంతో వాటిపై కన్నేసి దొంగలు.. ఏకంగా ట్రాక్‍నే ఎత్తుకుపోయారు. 2 కిలోమీటర్ల మేర ఉన్న రైలు పట్టాలను మాయం చేశారు. ఆ ఇద్దరి సహకారంతోనే? Railway Track theft: ఇద్దరు ఆర్పీఎఫ్ ఉద్యోగుల సహకారంతోనే ఈ రైల్వే ట్రాక్ చోరీ జరిగి ఉంటుందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. సమస్తిపూర్ డివిజన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఇద్దరు ఆర్పీఎఫ్ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇలా బయటికి.. Railway Track theft: ఎత్తుకెళ్లిన రైలు పట్టాలను స్క్రాప్ డీలర్‌కు విక్రయించేందుకు ప్రయత్నించటంతో ఈ ఘటన బయటికి వచ్చింది. ఆ ఇద్దరు ఆర్పీఎఫ్ ఉద్యోగులు.. ఇందుకు సహకరించినట్టు వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరిపై గతంలోనూ ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది.