పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, రాయుపల్లి రవి, పువ్వల ప్రవీణ్ తదితరులు పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతీలోని పలు గ్రామాలను పర్యటించారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు, వైద్య చికిత్సలు, ప్రభుత్వ సహాయం తదితరు వాటిపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెదమరికి పంచాయతీలోని పెదమరికి, చినమరికి, చందలంగి, కొత్తూరు తదితర గ్రామాల్లో ప్రజలు కిడ్నీ వ్యాధితో మృత్యువాత పడుతున్నారని తమ పర్యటనలో తెలిసిందన్నారు. కావున ఉన్నతాధికారులు స్పందించి పెదమరికి పంచాయతీలో ఉన్న గ్రామాలన్నింటిలో ఇంటింటికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ పంచాయతీ నుండి కిడ్నీ వ్యాధిని తరిమికొట్టాలన్నారు. అలాగే కిడ్ని వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.