TELANGANA

కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం కెసిఆర్ వార్నింగ్…

ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు దళిత బంధు స్కీమ్‌ కింద డబ్బులు తీసుకుంటున్నట్టు తన దగ్గర సమాచారం ఉందన్నారు కేసీఆర్‌. అది మళ్లీ రిపీట్ అయితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, పెన్షన్ల లాంటి వాటిని అందుకునే వారి సంఖ్య దాదాపు 50 వేల నుంచి 60 వేల మధ్య ఉందని.. వాళ్లందర్నీ కలిసేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న నిర్వహించే ప్లీనరీ ఉండదని.. ఇకపై బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుపుకుందామని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.

పాదయాత్రలకు సిద్ధం కావాలి..

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈమేరకు వారి నియోజవర్గాల్లో పాదయాత్రలకు సిద్ధం కావాలని, అలాగే సమావేశాలకు ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు. అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసుకుని, ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు.

ఎమ్మెల్యేలు తప్పులు చేయవద్దని, ప్రభుత్వ పథకాల పేరుతో లంచాలు తీసుకుంటే సహించేది లేదని, అలాంటి వారికి ఈసారి టిక్కెట్లు ఉండవని తేల్చి చెప్పారు. దాదాపు 99 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొంతమంది దళితబంధు, కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాల్లో దుర్వినియోగం జరిగినట్లు సమాచారం ఉందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.