2015లో ఈడీ స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు నితీష్ రాణా. అప్పటి నుంచి ఎన్నో కేసుల్లో ఈడీ తరపున వాదనలు వినిపించారు. నిన్నటివరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఐతే తాను వ్యక్తిగత కారణాలతోనే ఈడీ స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు రాణా. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక విచారణలు జరుగుతున్న ఈ సమయంలో..నితీష్ రాణా ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు..నిందితుల తరపున వాదించనుండటం సంచలనంగా మారింది.
రాబర్ట్ వాద్రా, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, డి.కే.శివకుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ, తదితర కేసుల్లో ఈడీ తరపున వాదించారు రాణా. అలాగే లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలపై కేసుల్లోనూ ఈడీ తరపున న్యాయవాదిగా ఉన్నారు. ఇక అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన కేసుల్లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ తరపున బ్రిటీష్ కోర్టులకు కూడా హాజరయ్యారు. 2020లో ది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన లీగల్ పవర్ లిస్ట్ జాబితాలోనూ ఉన్నారు నితీష్ రాణా.