TELANGANA

ఖమ్మంలో ఘోరం..కుక్కల దాడిలో బాలుడు మృతి…

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన ఘటన మరువక ముందే.. ఖమ్మంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో మరో బాలుడు చనిపోయాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటానితండా గ్రామ పంచాయతీలో జరిగింది. ఆదివారం కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించాడు. పుటానితండాకు చెందిన బానోతు భరత్ (5) ఆదివారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో వీధిలో ఉన్న కుక్కలు బాలుడిపై అకస్మాత్తుగా దాడి చేశాయి.

 

దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అనంతరం స్థానికులు.. హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

తెలంగాణలో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో కుక్కల దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుక్కల దాడులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది. దీంతో వీధి కుక్కలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది