దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. 126 రోజలు తర్వాత శనివారం కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. శనివారం ఏకంగా 800 కన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే దేశంలో కొత్తగా కరోనా వేరియంట్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. భారతదేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ XBB1.16 కేసుల సంఖ్య 76 నమోదు అయ్యాయని INSACOG డేటా వెల్లడించింది. XBB 1.16 వేరియంట్ మొదటిసారి జనవరిలో కనుగొనబడింది. ఫిబ్రవరి నెలలో 59 కేసులు రాగా.. మార్చి నెలలో 15 కేసులను కనుగొన్నారు.
కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పదుచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయని CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం INSACOG డేటా వెల్లడించింది. ఇటీవల పెరుగుతున్న కోవిడ్-19 కేసులకు ఈ వేరియంట్ కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ఇటీవల పెరుగుతున్న ఇన్ ఫ్లూఎంజా హెచ్3ఎన్2 కేసులు XBB 1.16 వేరియంట్ పెరుగుదలకు కారణం అవుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఈ వేరియంట్ పెద్దగా ప్రమాదకరం కాదని..భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ప్రస్తుతం కొత్త వేరియంట్ XBB.1.16 మొత్తం 12 దేశాల్లో కనుక్కున్నారు. అమెరికా, బ్రూనై, సింగపూర్, యూకేల తర్వాత అత్యధికంగా ఈ వేరియంట్ కేసులు ఉన్న దేశంగా భారత్ ఉంది. భారతదేశంలో గత 14 రోజుల్లో కేసులు 281 శాతం పెరగినట్లు, మరణాలు 17 శాాతం పెరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. ఇప్పటికే పలు వేరియంట్లు భారత ప్రజలపై దాడి చేశాయి. అయితే భారతీయులు వీటన్నింటికి వ్యాధినిరోధక కలిగి ఉంటే, ప్రపంచం మాత్రం ఈ వేరియంట్లతో ఆందోళన చెందుతోంది.