TELANGANA

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌ కేసులో..టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 40 మంది ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు జారీ..

తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులని విచారిస్తున్న అధికారులకు సంచలన విషయాలు వెలుగులోకి తెస్తున్నారు. టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న వాళ్లందరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 40 మంది ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు జారీ చేసింది. వీళ్లలో పేపర్‌ లీక్స్‌ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌లతో సంబంధాలు ఉన్న వాళ్లే ఉన్నట్లు సమాచారం. వారిలో ఇప్పటికే 10 మందికి పైగా గ్రూప్-1 పరీక్ష రాసినట్టు సిట్ గుర్తించింది. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్‌ రూం అధికారిణి శంకర్‌ లక్ష్మిని రెండుసార్లు పిలిపించుకుని ప్రశ్నించింది. ఈమె సిస్టమ్‌ నుంచే పేపర్లు లీక్‌ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీలో టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్నవాళ్లు కూడానోటీసులు అందుకున్నట్లు తెలుస్తోంది.

 

మరోవైపు పేపర్​ లీకేజీ కేసులో నిందితులను సిట్​ప్రశ్నిస్తోంది. అరెస్టు చేసిన 9 మంది నిందితులకు ఆరు రోజుల కస్టడీలో భాగంగా సిట్​ ఐదో రోజు విచారణను కొనసాగింది. లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టు సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రశ్న పత్రాల గురించి ఉద్యోగ అభ్యర్థులతో రేణుక, ఆమె భర్త మాట్లాడినట్టు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేణుక కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నిందితులు ఎవరేవరికి కాల్స్​ చేశారనే కోణంలో దర్యాప్తు చేశారు. ప్రధాన నిందితులు ప్రవీణ్​, రాజశేఖర్​రెడ్డి బ్యాంకు ఖాతాలను సిట్​ బృందం పరిశీలించింది.