TELANGANA

సీఎం కేసిఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటన…పంట నష్టం పై రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మూడు రోజులు కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల వానతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. నష్టం వివరాలను తెలుసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు గ్రామాల్లో పర్యటించి నివేదికలు సిద్ధం చేసి అందజేశారు. జిల్లాలో వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, టమాటో తదితర పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న కోత దశలో కిందపడిపోవడంతో యంత్రాలతో కోయలేని పరిస్థితి నెలకొంది. వడగళ్ల వానకు ఆయా రైతులు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.