వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయం వద్దకు వచ్చారు.
కానీ అంతకు ముందే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కనుక హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డిని విచారించాలనే ఉద్దేశ్యంతో సీబీఐ విచారణను మంగళవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసిన్నట్లు సాక్షితో సహా మీడియాలో వార్తలు వచ్చాయి.
కానీ హైకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రమే అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. వివేకా హత్య కేసులో తమపై కూడా ఆయన ఆరోపణలు చేసినందున, ఈ కేసులో ప్రవేశించేందుకు అనుమతి కోరుతూ సునీతా రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై కూడా హైకోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతోంది.
అవినాష్ రెడ్డిని ఎప్పుడు విచారణకు పిలిచినా హైకోర్టులో ఏదో ఓ పిటిషన్ వేస్తూ విచారణకు హాజరు కాకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని, మరోవైపు ఈ నెలాఖరులోగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, కనుక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని సీబీఐ న్యాయవాది హైకోర్టుని కోరారు. ప్రస్తుతం అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపటిలో హైకోర్టు తీర్పు ప్రకటించనుంది.
ఒకవేళ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన్నట్లయితే, వెంటనే విచారణకు హాజరుకావలసిందిగా సీబీఐ కోరవచ్చు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకొంటున్నట్లు సీబీఐ ఇదివరకే హైకోర్టుకు తెలియజేసింది. అందుకే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకొన్నారు కూడా. కానీ కోర్టుని ఆశ్రయించి ఎంతకాలం అరెస్ట్‌లను తప్పించుకోగలరు?కనుక నేడు కాకపోతే రెపైనా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.