ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వేల కోట్లకు సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నాడు.
ఆదాయమే పరమావధిగా ముందుకు వెళుతున్నాడు. ట్విట్టర్ ని దక్కించుకున్న వెంటనే కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను తీసేశాడు. అలాగే వెరిఫైడ్ అకౌంట్ కోసం డబ్బులు చెల్లించాలన్న నిబంధన తెచ్చాడు.
దీంతో చాలా మంది వెరిఫైడ్ బ్లూ టిక్ కోసం ఏడాది చందా లేదా నెల నెలకు చందా చెల్లిస్తున్నారు. ఈ చందా చెల్లించని కారణంగా టాలీవుడ్ స్టార్స్, పొలిటికల్ లీడర్స్ బ్లూ టిక్ కోల్పోయారు. ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, నితిన్, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, వెంకటేష్, అల్లు అర్జున్, నాగ చైతన్య ఇంకా పలువురు ఉన్నారు. ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా బ్లూ టిక్ కోల్పోయారు.
అయితే టాలీవుడ్ టాప్ హీరోల్లో కొందరు బ్లూ టిక్ కాపాడుకున్నారు. ఎన్టీఆర్ అకౌంట్ బ్లూ టిక్ కలిసి ఉంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ సైతం వెరిఫైడ్ బ్లూటిక్ మైంటైన్ చేస్తున్నారు. వీరు వారి చందా డబ్బులు చెల్లించిన నేపథ్యంలో వెరిఫైడ్ బ్లూ టిక్ తీసేయలేదు. బ్లూ టిక్ కోల్పోయినవారు డబ్బులు చెల్లించాక మరలా పునరుద్ధరిస్తారు. నేటి ఉదయం నుండి #bluetick ట్రెండ్ అవుతుంది.
పలువురు సెలబ్రిటీలు దీనిపై స్పందిస్తున్నారు. ఫేక్ అకౌంట్స్ నుండి నెటిజెన్స్ ని కాపాడేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ఈ బ్లూ టిక్ విధానం తెచ్చాయి. అత్యంత ఆదరణ కలిగిన ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఈ బ్లూ టిక్ విధానం కొనసాగిస్తున్నాయి. దాని వలన అయోమయం లేకుండా మనం వెతుకుతున్న సెలెబ్రిటీ ఎవరో సులభంగా గుర్తించవచ్చు. మోసాలను, అపార్థాలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది.