APTELANGANA

టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలపై సీఎస్ శాంతి కుమారి మీటింగ్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన జరిగిన స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశంలో టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇంటర్ డిపార్ట్‌ మెంటల్ సమస్యలపై చర్చించారు.

అనేక టెలికాం సూచికలలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుందని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. దాదాపు 3.5 కోట్ల జనాభాకు నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లతో టెలి-సాంద్రత (107%) దేశంలోనే అత్యధికం. 97.7 శాతం గ్రామాలు మొబైల్ కనెక్టివిటీతో ఉన్నాయి అని ఆమె తెలిపారు.

దేశంలో 5జీని ప్రారంభించిన అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.. పెండింగ్‌లో ఉన్న రైట్ ఆఫ్ వే దరఖాస్తుల పరిస్థితిని సమావేశంలో సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. 5జీ సేవలను వేగవంతం చేసేందుకు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ రకమైన తవ్వకాలనైనా ప్రారంభించేందుకు “కాల్ బిఫోర్ యు డిగ్” (సీబీయుడి) యాప్ ద్వారా ముందస్తు సమాచారం అందించిన తర్వాతే తవ్వకాలు చేయాలని సీఎస్ శాంతికుమారి సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ఇంజినీరింగ్ విభాగాలు ముందుగా యాప్‌ను ఉపయోగించేలా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.