9 సంవత్సరాలు పూర్తిచేసుకొని పదో ఏట అడుగుపెట్టిన తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది.
రోజుకో రంగం చొప్పున 21 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా ఇవి నిలవనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఫ్రాన్స్ శుభవార్త వినిపించింది. దేశంలోని చైతన్యవంతమైన రాష్ట్రమైన తెలంగాణలో ‘బ్యూరో డి ఫ్రాన్స్’ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఎమ్మాన్యుయేల్ లెనేన్ ప్రకటించారు. కేటీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ లో లీ బ్యూరో డి ఫ్రాన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం గత ఏడాదే ప్రకటించింది. బ్యూరో డి ఫ్రాన్స్ అనేది ఓ సేవా కేంద్రం. భారత విద్యార్థులు, ఫ్రెంచ్ యూనివర్సిటీల మధ్య.. అనుసంధానకర్తగా ఉపయోగపడనుంది. అలాగే ఈ కేంద్రం వీసాలను కూడా జారీచేసే అవకాశం ఉంది.
2023 ద్వితీయార్థం నుంచి ఈ కేంద్రం పని చేస్తుందని, పరిశ్రమలు, ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గతంలోనే చెప్పారు. బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్‌కు అనుసంధానంగా ఇది పనిచేయబోతోంది. హైదరాబాద్‌లోని కంపెనీలతో వ్యాపార సంబంధాలు ఏర్పర్చడానికి, వాటిని బలోపేతం చేసేందుకు, దౌత్య సేవలు అందించడానికి దీనివల్ల వీలు కలుగుతుంది.