TELANGANA

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పోటెత్తిన సాయం-రక్తదానానికి భారీగా క్యూలు..

ఒడిశాలోని బాలాసోర్ లో నిన్న రాత్రి మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. 300 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని చుట్టుపక్కన జిల్లాల్లో ఉన్న ఆస్పత్రులకు తరలించారు.

అయితే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పోటీ పడి స్ధానికులు తరలివచ్చారు. ముఖ్యంగా రక్తదానానికి స్ధానిక యువకులు భారీగా క్యూలు కట్టారు. దీంతో మానవత్వం పరిమళించింది.

బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనను సోషల్ మీడియాలో తెలుసుకున్న యువకులు వందల సంఖ్యలో స్ధానిక ఆస్పత్రులకు పరుగులు తీశారు. క్షతగాత్రుల్ని ఆదుకునేందుకు తమకు తోచిన వస్తువుల్ని, ఆహారాన్ని తీసుకెళ్లారు. అలాగే రక్తదానం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఆయా ఆస్పత్రులు, డాక్టర్లకు కూడా తమ పని సులువైంది. టీవీల్లో బాధితుల్ని చూసి చలించి పోయిన యువకులు తమకు చేతనైంత సాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

రైలు ప్రమాద బాధితుల్ని ఆదుకునేందుకు అర్ధరాత్రి ఆస్పత్రుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, విద్యార్ధులు గంటల తరబడి వేచి ఉండటం, రక్తదానం చేసేందుకు క్యూల్లో నిలబడిపోవడం చూసిన వారికి కళ్లు చెమర్చాయి. ఓ అనుకోని ఘటన జరిగినప్పుడు మానవత్వం ఉన్న మనుషులుగా స్పందించడానికి వారు పడిన తపన ఇప్పుడు ఎంతోమందిని కదిలిస్తోంది. వీరిని ఆదర్శంగా తీసుకుని ఇవాళ కూడా పలువురు రక్తదానానికి ముందుకొస్తున్నారు.