TELANGANA

టీడీపీ, జనసేన పొత్తు – తొలి సీటు అభ్యర్ధి ఖరారు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ ద్వారా బీజేపీతో పొత్తు దిశగా తొలి అడుగు పడింది.

ఈ పొత్తుల వ్యవహారంలో సీట్ల సర్దుబాటు అంశంపైన జనసేన నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీట్లపైన పవన్, చంద్రబాబు చర్చిస్తారని చెప్పటం ద్వారా పొత్తు ఖాయమైందని స్పష్టం చేసారు. ఇదే సమయంలో తన సీటు గురించి ప్రకటన చేసారు.

పొత్తు లాంఛనమే: టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన లాంఛనమే. బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు ప్రారంభించారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ సమావేశానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ తో మైత్రి దిశగా చంద్రబాబు నుంచి ప్రతిపాదన అందినట్లుగా సమాచారం. తెలంగాణలో బీజేపీకి తమ నుంచి సహకారం ఉంటుందని.. ఏపీలో తమకు బీజేపీ సహకారం కావాలని చంద్రబాబు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు.

తెలంగాణలో టీడీపీ సహకారం తీసుకుంటే రాజకీయంగా కలిగే లాభ నష్టాల ఆధారంగా నిర్ణయం తీసుకొనే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉంది. ఏపీలో పొత్తులపైన ఎటువంటి నిర్ణయం జరగలేదని తెలుస్తోంది. ఇది ప్రాధమిక స్థాయిలో చర్చలేనని.. పొత్తు దిశగా మరిన్ని భేటీలు ఉంటాయని ముఖ్య నేతల సమాచారం.

మూడు పార్టీల పొత్తులు: ఇటు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీట్ల సర్దుబాటు వ్యవహారం రెండు పార్టీల అధినేతలు చర్చిస్తారని వెల్లడించారు. ఇప్పటికే జనసేనాని పవన్ సర్వే నివేదికలతో సిద్దం అయ్యారు. తాను ఎక్కడ పోటీ చేయాలనే అంశంతో పాటుగా తమ పార్టీ బలం..బలహీనతల పైన క్షేత్ర స్థాయి సమాచారం సేకరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి పవన్ తన వారాహి యాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా గోదావరి జిల్లాల నుంచి యాత్ర ప్రారంభం కానుంది.