APTELANGANA

రైల్వేలో ఇంతకంటే అన్యాయం మరొకటుంటుందా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇతర జోన్లు ఈ ప్రతిపాదనలను అడ్డుకుంటున్నాయి.

వాటికి అవి చెప్పే కారణం ఒకటే.. ట్రాక్ రద్దీ అని. 21 రైళ్లను ప్రవేశపెట్టాలని, వీటిల్లో కొన్ని రోజువారీ, మరికొన్నింటినీ వారానికి రెండు సార్లు, కొన్నింటిని వారానికోసారి నడిపేలా అధికారులు ప్రణాళికలు రచించారు.

కొన్నింటిని జోన్లు అడ్డుకుంటుంటే మరికొన్నింటినీ రైల్వే బోర్డు పక్కన పెట్టింది. జోన్ల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైనరీతిలో సేవ చేయాల్సినవారు ఫక్తు రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి డిల్లీకి ముందుగా టికెట్ తీసుకుంటే రూ.5వేలు అవుతుంది. అలా కాకుండా ప్రయాణానికి ముందురోజు తీసుకుంటే రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఉంటోంది. రైలులో అయితే చాలా తక్కువలో అయిపోతుంది. స్లీపర్ రూ.695, థర్డ్ ఏసీ రూ.1825, సెకండ్ ఏసీ రూ.2225గా ఉంది.

రిజర్వేషన్ దొరక్క, రైళ్లు లేక చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. జమ్ముతావి వరకు నడుపుదానుకున్న రైలును ఐఆర్ సీటీసీ, వారణాసికి నార్త్ సెంట్రల్ రైల్వే జోన్, గోరఖ్ పూర్ వరకు నడపాలనుకున్న రైలుకు బోర్డు పెండింగ్ లో పెట్టింది. అలాగే దర్భంగా, అగర్తల, పూరీ, జోధ్ పూర్, భుజ్, సోమనాథ్ కు రైల్వేశాఖ అనుమతివ్వడంలేదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర భారతదేశానికి పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. హైదరాబాద్ నుంచి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ కు నేరుగా రైళ్లు లేవు. ఢిల్లీ వరకు వెళ్లి అక్కడి నుంచి మరో రైలు ఎక్కాలి. కొన్నిసార్లు రైల్వేస్టేషన్లు మార్చాల్సి వస్తోంది.. మరికొన్ని సార్లు ప్లాట్ ఫాంలు మార్చాల్సి ఉంటుంది.