ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది. పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. సహా పలువురు పార్టీ నాయకులు ఈ సభ వేదికపై కనిపించారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ సైతం కాంగ్రెస్ నాయకులతో కలిసి వేదికను పంచుకున్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మధు యాష్కీ గౌడ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీ హనుమంతరావు, సీతక్క.. వంటి నేతలు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలను గుప్పించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా దోచుకుందంటూ మండిపడ్డారు. భారత్ రాష్ట్ర సమితి అనేది బీజేపీ రిష్తేదార్ సమితి మారిందంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ అవినీతిలో బీజేపీకీ వాటా ఉందని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీ-టీమ్ మధ్యే ఎన్నికల యుద్ధం ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పాట్నాలో ఇటీవలే జరిగిన దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీ సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేయడానికి బీఆర్ఎస్ వ్యతిరేకించిందంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ను వీడిన వారందరికీ తలుపులు తెరిచే ఉన్నాయని, వారు ఎప్పుడైనా తమ పార్టీలో చేరొచ్చంటూ ఆహ్వానించారు.
కాగా- ఈ సభా వేదిక మీదుగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోకు శ్రీకారం చుట్టింది. కర్ణాటక తరహాలో తొలి గ్యారంటీని ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతామని ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతినెలా 4,000 రూపాయల పింఛన్ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకానికి చేయూత అని పేరు పెట్టింది.