తెలంగాణ ప్రభుత్వం మత్యకారులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం చేపపిల్లలు, రొయ్యల పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం తీసుకున్న చొరవతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
దీంతో రాష్ట్రంలో ఏటా నాలుగు లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి.
వీటిని మత్స్యకారులు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాలకు 10 శాతం మేర ఎగుమతి అవుతున్నాయి. ఇక మత్స్యశాఖ దుకాణాలను కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా రొయ్యలు, చేపలను విక్రయిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రొయ్యలు, చేపల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో వాటిని మార్కెటింగ్ చేయటం పైన కూడా దృష్టి సారించారు.
ఇప్పటికే తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా అత్యాధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేపట్టాలని తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ దృష్టిసారించింది. ఈ క్రమంలో తెలంగాణ మత్స్య సహకార రాష్ట్ర సమాఖ్య ఆధ్వర్యంలో తయారుచేసే చేపల ఉత్పత్తులను అత్యాధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ నిర్వహించటానికి అనుసరించాల్సిన విధానాలపై సనత్ నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కేంద్ర కార్యాలయంలో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అధికారులతో చర్చించారు.
ఫిషరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో తయారుచేయడానికి నిర్ణయించిన చేపల పచ్చళ్లు, రొయ్యల పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వీలున్న ప్యాకేజీ పద్ధతులపై ఈ సందర్భంగా మాట్లాడారు. ఫిషరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తయారు చేసిన పదార్థాలతోపాటు ఎండు చేపలు, ఎండు రొయ్యలు తదితర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీ పద్ధతులపై కూడా ఈ సందర్భంగా చర్చించారు.
మొత్తానికి ఈ నిర్ణయంతో చేపలు, రొయ్యలతో అనేక ఆహార ఉత్పత్తులను కూడా తయారు చేసి ప్రజలకు అనేక రుచులను అందించటానికి ఫిషరీస్ ఫెడరేషన్ సిద్ధమైంది. మరి ఈ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాల్సి ఉంది.