TELANGANA

మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ పునఃప్రారంభం

భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది.

దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయి. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాకాలంలో 20 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 603.2 మిల్లీమీటర్లు కాగా… ఇప్పటివరకు 723.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు.

 

ఇదిలా ఉంటే.. మంగళవారం ఉదయం నుండి హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా భారీగా ఇన్‌ఫ్లోలు రావడంతో పాటు నగరంలో పౌరులకు ప్రమాదకరంగా మారే కొన్ని ఫ్లై ఓవర్‌లను అధికారులు మూసివేశారు. బుధవారం అదే ఫ్లై ఓవర్‌ను ట్రాఫిక్‌ కోసం పునఃప్రారంభించారు. మూసీ నదిలో నీటిమట్టం పెరగడంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మూసారాంబాగ్‌ వంతెనను మూసివేసిన సంగతి తెలిసిందే. నది చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలలో వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.