TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల నేపథ్యంలో దూకుడు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల నేపథ్యంలో దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ, కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీట్ చేసే పనిలో పడింది.

తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్లో ఇటీవల కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన సిడబ్ల్యూసి తొలి భేటీని హైదరాబాద్లో నిర్వహించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు.

సెప్టెంబర్ 16వ తేదీన సిడబ్ల్యుసి భేటీ నిర్వహిస్తుండగా, సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించి, ఈ ర్యాలీ ద్వారా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అదే సెప్టెంబర్ 17వ తేదీన సి డబ్ల్యూ సి తోపాటు అన్ని పిసిసి లీడర్లు, సీఎల్పీ లీడర్లు, ఇతరులతో మరో సమావేశాన్ని నిర్వహించనున్నారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వెళ్లాలి? ప్రజల మద్దతును పొందడానికి ఏం చేయాలి? క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి? పార్టీ నేతల మధ్య ఏ విధంగా సమన్వయాన్ని పెంచాలి? అన్న కోణంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల అభ్యర్ధులపై కూడా చర్చించనున్నారు.తెలంగాణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే విధంగా అనేక హామీలను కూడా ప్రకటించనున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యుసి సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వేదికగా తీసుకునే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి లబ్ధిని చేకూరుస్తాయని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యుసి భేటీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేసే ప్రయత్నం, ప్రజలకు మళ్లీ కాంగ్రెస్ పార్టీపై నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయనున్నారు కాంగ్రెస్ నేతలు.