TELANGANA

బండి సంజయ్ ఇంటి వద్ద బైకర్ల హల్‌చల్- తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది.

7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేకపోవడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముమ్మరం చేసింది.

ఈ పరిస్థితుల్లో కరీంనగర్ (Karimnagar)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఇంటి వద్ద ఈ సాయంత్రం కొందరు బైకర్లు హల్‌చల్ చేశారు. కరీంనగర్‌లోని ఆయన నివాసం, కార్యాలయం వద్ద బైక్‌పై ర్యాలీ తీశారు. గట్టిగా హారన్ మోగిస్తూ కనిపించారు. ఈ పరిణామాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ కార్యకర్తలుగా చెబుతున్నారు. పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ హల్‌చల్ చేశారని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయం తెలియడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బండి సంజయ్ ఇంటికి చేరుకున్నారు. బైకర్ల చర్యలకు వ్యతిరేకంగా అక్కడే బైఠాయించారు. ఈ పరిణామాలపై బీజేపీ (BJP) నాయకురాలు డీకే అరుణ (DK Aruna) స్పందించారు. వారంతా ఎంఐఎం (MIM) సానుభూతిపరులేనని ఆరోపించారు.

బీజేపీ మత రాజకీయాలు చేస్తోందంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడే మంత్రి కేటీఆర్ (KTR) ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీ నాయకుల చర్యలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. ఓ ఎంపీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తోన్నారని డీకే అరుణ నిలదీశారు.