TELANGANA

హరీశ్ సమక్షంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాదాభివందనం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రం మరోసారి అంధకారంలోకి వెళుతుందన్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్‌ పాలనలో కాలిపోయే మోటర్లు..

కరెంటు కటకటలు.. కరువులు కర్ఫ్యూలేనని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి స్వాగత సభ, 16న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ విజయవంతం కోసం నియోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సులో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాధోడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. 2001లోనే ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరినగడ్డ అని.. గులాబీ జెండా అడ్డ జనగామన అని అన్నారు. కేసీఆర్‌కు జనగమా అంటే ప్రేమ అని చెప్పారు. జనగామలో గెలిచేది పక్కా గులాబీ జెండా అన్నారు. ఢిల్లీని కదిలించి.. కేసీఆర్‌ తెలంగాణ సాధించారన్నారు.

రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రంలో గులాబీ జెండా కప్పుకున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు.

2010లో తెలంగాణల ఉద్యమ సమయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిచయమన్నారు. సీఎం మీటింగ్‌ లక్ష మందితో జరగాలన్నారు. కేసీఆర్‌ సభను కార్యకర్తలు ముందుండి నడపాలన్నారు. నిండు మనసుతో దీవించడమే బీఆర్‌ఎస్‌ క్రమశిక్షణ అని, కాంగ్రెస్‌ వారి మూటలు, మాటలు.. కుర్చీల కోసమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశం ఇచ్చినా చేయలేని అభివృద్ధిని 11 సంవత్సరాల్లోపే కేసీఆర్‌ అభివృద్ధి చేశారన్నారు. 15న మేనిఫెస్టోను సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని, 16న జనగామ బహిరంగ సభకు హాజరవుతారన్నారు.

జనగామలో బీఆర్‌ఎస్‌ గెలుపు విషయంలో డౌటే లేదని.. భారీ మెజారిటీ రావాలన్నారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్‌కు భారీ స్వాగతం పలకాలని, పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌లో బేధాభిప్రాయాలు లేవని.. అందరు ఒకటే అభివృద్ధి చేసుకున్నానన్నారు. పల్లా, ముత్తిరెడ్డి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు మంత్రి హరీశ్ రావు.

ముత్తిరెడ్డికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాదాభివందనం

కాగా, హరీశ్ రావు హాజరైన ఈ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వేదికపై టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి స్వీట్ తినిపించి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పల్లా రాజేశ్వ ర్ రెడ్డి.. ముత్తిరెడ్డికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవడం గమనార్హం.

ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డిని జనగామ నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనగామలో ఎలాంటి వర్గాలు లేవన్నారు. ఒకే వర్గం ఉందని.. అది కేసీఆర్ వర్గమని ముత్తిరెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో మిగిలిన పనులను పూర్తి చేయాలని పల్లాకు సూచించారు. ఇక 14 ఏళ్ల కాలంలో కార్యకర్తలను ఇబ్బంది పెట్టివుంటే క్షమించాలని ముత్తిరెడ్డి కోరారు. కాగా, ముత్తిరెడ్డికి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టి విషయం తెలిసిందే. దీంతో ముత్తిరెడ్డి జనగామ సీటును పల్లాకు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.