TELANGANA

టీఆర్ఎస్‌కు సిలిండర్ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజ్య సమితి (TRS)కు కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం.

ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులతో కలిసి తెలంగాణ రాజ్య సమితిని రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఎన్నికల సంఘానికి ఈ పార్టీ దరఖాస్తు చేసుకుంది.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ పలు షరతులతో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్టీ తరపున బరిలో ఉండే అభ్యర్థులందరికీ గ్యాస్ సిలిండర్ గుర్తునే కేటాయించాలని ఆదేశించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం కనీస శాతం సీట్లలో సదరు పార్టీ పోటీ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో సదు పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తును ఇతరులకు కేటాయించవచ్చని కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

గతంలో కేసీఆర్ నేతృత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుపాకుల బాలరంగం నేతృత్వంలో పలు జిల్లాల ఉద్యమకారులు తెలంగాణ రాజ్య సమితి పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.

తుపాకుల బాలరంగం గురించిన వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన ఆయన.. 1983 నుంచి కేసీఆర్ తోనే ఉన్నారు. 1987, 1995లో పొన్నాల గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2001లో సిద్దిపేట మండల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. 2006లో సిద్దిపేట జడ్పీటీసీ సభ్యుడిగా, 2019 నుంచి 2021 వరకు ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగారు.

ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారడంతో తెలంగాణ రాజ్య సమితి పార్టీని ఏర్పాటు చేశారు బాలరంగం. సికింద్రాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్ లో ఉన్న తన ఇంటి చిరునామాను పార్టీ కార్యాలయం అడ్రస్‌గా పేర్కొంటూ ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజ్య సమితి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆ పార్టీకి సిలిండర్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. అయితే, టీఆర్ఎస్ పేు మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది.