TELANGANA

గజ్వేల్‌లో కేసీఆర్ బాధితులే నా ఓటుబ్యాంకు : ఈటల రాజేందర్

తెలంగాణ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా ఢీకనబోయే నేతలలో ఒకరైన ఈటల రాజేందర్(Eetala Rajender) ఒకరు. కేసీఆర్ పోటీచేయబోయే గజ్వేల్ నుంచి బీజేపీ తరపున ఈటల బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

 

ఈ సందర్భంగా ఆయన గజ్వేల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. “పదేళ్లలో కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజలు గుర్తు రాలేదు.. కేవలం ఎన్నికల ముందు గుర్తొస్తున్నారు. నేను ఇక్కడ పోటీ చేస్తున్నాని తెలియగానే బీఆర్ఎస్(BRS) నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంత్రి హరీష్ రావు(HarishRao) గజ్వేల్ లో ప్రచారం చేస్తే.. హరీష్ కు వ్యతిరేకంగా తాను సిద్దిపేటలో ప్రచారం నిర్వహిస్తాను. అలాగే అధికారులు అధికార పార్టీ నేతల కనుసన్నలో పని చేయకూడదు.. చట్టాలకు లోబడి పని చేయాలి” అని వ్యాఖ్యానించారు.

 

గజ్వేల్‌లో అభివృద్ధిని సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. గజ్వేల్‌లో చాలామంది ప్రజలతో ఆయన మాట్లాడనని.. వారిలో ఎక్కువమంది కేసీఆర్ బాధితులు ఉన్నారని చెప్పారు. ఆ బాధితులందరికీ తాను అండగా నిలుస్తానని.. వారంతా తనకే ఓటు వేస్తారని అన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి ఖాయమైందని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు.