తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు జోరుగా తలపడుతున్నారు. ఇక ప్రచారంలో భాగంగా టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా రైతు బంధు నిధులకు ఈసీ బ్రేక్ వేయటంతో ఇదంతా కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది.
ప్రస్తుతం దీనిపై రచ్చ కొనసాగుతున్న వేళ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా రేవంత్ రెడ్డి రైతుబంధు రైతుల ఖాతాలో వేయాలని ఈసీకి మేం విజ్ఞప్తి చేశామన్నారు. ఈసీ అనుమతి ఇచ్చినా.. హరీష్ రావు నోటిదూల, కేసీఆర్ అతి తెలివి వల్ల… రైతు బంధు ఆగిందని విమర్శించారు. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయాయని విమర్శించారు.
రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా… రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆరెస్ నేతలను తరిమికొట్టండి అని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయని విమర్శించారు. అల్లుడు హరీష్ వల్లే రూ.5వేల కోట్లు ఆగిపోయినాయ్.. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి. నవంబర్ 30 న అల్లుడు హరీష్ కు, మామ కేసీఆర్ కు బుద్ది చెప్పాలి.
ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ దని పేర్కొన్నారు. పదిరోజుల్లో తాము అధికారంలోకి వస్తున్నామని, వచ్చీ రాగానే రైతు భరోసా క్రింద 15 వేల రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు మేలు చేసే ఉద్దేశం కేసీఆర్ కు, హరీష్ రావు కు లేవని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలలో రైతు భరోసా ఒకటి అని, దీని ద్వారా రైతులకు ఎకరానికి సంవత్సరానికి రూ.15వేలు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఎకరానికి సంవత్సరానికి రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.