AP

లోకేష్ యువగళం మళ్లీ ప్రారంభం-అదే పొదలాడ నుంచి మొదలు..

టీడీపీ యువనేత నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను పునఃప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్.. ఇవాళ గతంలో ఆపిన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడ నుంచే తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్ మళ్లీ పాదయాత్రలోకి దిగడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

 

గతంలో తన తండ్రి చంద్రబాబును స్కిల్ కేసులో సీఐడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ వ్యవహారాలు చూడటం, పార్టీని నడిపించడం కోసం నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. దీంతో అప్పటివరకూ ఉత్సాహంగా సాగిన పాదయాత్ర ఒక్కసారిగా నిలిచిపోయింది. ఇది టీడీపీ శ్రేణుల్లోనూ నిరాశ కలిగించింది. ఇప్పుడు 79 రోజుల విరామం తర్వాత లోకేష్ తిరిగి పాదయాత్ర మొదలుపెట్టారు. వాస్తవానికి శ్రీకాకుళం వరకూ పాదయాత్ర చేయాలని గతంలో భావించినా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో దీన్ని విశాఖ వరకూ కొనసాగించి ముగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

 

గతంలో యువగళం పాదయాత్రకు ప్రకటించిన షెడ్యూల్ తో పాటు ఈసారి రూటు కూడా మారింది. అలాగే పాదయాత్రలో భాగంగా చేపట్టే కార్యక్రమాలు కూడా మారిపోయాయి. అయితే ర్యాలీ, సభలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. మిగతా కార్యక్రమాల్లో మాత్రం మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు సంబంధించిన తాజా షెడ్యూల్స్ ను టీడీపీ వర్గాలు రోజువారీగా ప్రకటించబోతున్నాయి. లోకేష్ పాదయాత్ర విశాఖలో ముగించాలని భావిస్తే ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఇతర కార్యక్రమాల షెడ్యూల్ పైనా క్లారిటీ రానుంది.