TELANGANA

రైతుబంధులో కీలక మార్పులు.. కండీషన్స్ అప్లై.. వీరే అర్హులు..!!

పథకంపై పునఃసమీక్ష..

ప్రభుత్వం రైతుబంధు పథకం పునఃసమీక్షిస్తోంది. ఈ యాసంగి సీజన్‌ వరకూ గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులూ లేకుండా రైతుబంధు పంపిణీ చేసి.. వచ్చే వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ నుంచి 10 ఎకరాల పరిమితితో రైతుభరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా.. పది ఎకరాలకు మాత్రమే రైతుభరోసా ఇవ్వనున్నట్టు సమాచారం.

 

అంటే ఒక రైతుకు 15 ఎకరాలుంటే.. 10 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది. మిగతా ఐదెకరాలకూ రాదు. అలాగే.. ఇప్పటిదాకా ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు పంపిణీ చేస్తుండగా.. వచ్చే సీజన్‌ నుంచి ఒక పంటకు ఎకరానికి రూ.7,500 చొప్పున… ఏడాదికి రూ.15 వేల చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిసింది.

 

పరిమితులు – ప్రతిపాదనలు…

రైతుభరోసా పథకానికి పరిమితులు విధించినా లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులుండగా.. వీరందరికీ రైతుభరోసా అందుతుంది. రాష్ట్రంలో 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.50 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే పదెకరాల పరిమితి పెడితే… 1.15 లక్షల మందికి 11.50 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది.

 

లక్ష ఎకరాలకు కట్..

కటాఫ్‌ విధించటం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది. ఎకరానికి రూ.15 వేల చొప్పున ఏడాదికి రూ.150 కోట్లు తగ్గుతుంది. కానీ ఇప్పటి వరకూ ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచటంతో.. 50 శాతం ఆర్థిక భారం పెరుగుతుంది.

 

ఐదు కరాలకు అమలు..

ఒక లక్ష ఎకరాలకు మినహాయించి.. 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలంటే… ఏడాదికి రూ.22,350 కోట్లు అవుతుంది. ఇప్పటివరకూ రైతుబంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు రూ.15 వేల కోట్లు. అంటే, ఇకపై రూ.7,350 కోట్ల మేర ఆర్థికభారం పెరిగే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.