అధికారంలోకి రాగానే వెంటనే రైతు భరోసా డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అప్పట్లో ఎన్నికల సంఘం రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఒప్పుకుంది. అయితే ప్రభుత్వం ఖాతాలో డబ్బులు లేకపోవడంతో రైతుబంధు ఆగిపోయింది. ఆ తరుణంలో రైతులకు సంబంధించి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసాను ఎకరానికి 2500 పెంచి వేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై అప్పట్లో అటు భారత రాష్ట్ర సమితి ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య విమర్శలు చెలరేగాయి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అధికారం చేపట్టిన వెంటనే ఆరు గ్యారెంటీ ల పైన సంతకాలు చేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత రైతు భరోసా కు సంబంధించిన డబ్బుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ మాదిరిగానే రైతు భరోసా డబ్బులు వేస్తామని ప్రకటించారు. అయితే ఇంతవరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. మరోవైపు యాసంగి సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల రైతులు నాట్లు వేస్తున్నారు. ఇలాంటి క్రమంలో రైతులకు పెట్టుబడి నిమిత్తం డబ్బులు చాలా అవసరం పడతాయి. పైగా వరుస ప్రకృతి విపత్తుల వల్ల వర్షాకాలంలో ఆశించనంతస్థాయిలో పంట దిగుబడి రాలేదు. ఈ నేపథ్యంలో రైతులు సర్కారు అందించే రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
More
From Telangana politics
అయితే ఇదే సమయంలో మొదటి దాకా భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేసిన కొంతమంది యూట్యూబర్లు రైతులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే వారి నోటితో కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటు వేసామని చెప్పిస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో బలంగా తీసుకెళ్తున్నారు.అయితే గత ఏడాది డిసెంబర్ 29 తర్వాతే రైతుబంధు డబ్బులు వేశారని, ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు కాకముందే ఇలా విమర్శలు చేయడం ఏంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల పాటు గడువు ఇద్దామని.. తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిలదిద్దామని అన్నారని.. కనీసం ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించడం దేనికి సంకేతం అని కాంగ్రెస్ నాయకులు భారత రాష్ట్ర సమితి అనుకూల జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడినాటికి 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం కెసిఆర్ 10 సంవత్సరాల పాలన కాలంలో ఆరు లక్షల కోట్ల అప్పులు చేసిందని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. రెవెన్యూ లోటు, రెవెన్యూ వ్యయం, గ్యారెంటీ అప్పులను ఇష్టానుసారంగా చేసిందని సభ దృష్టికి తీసుకొచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం శ్వేత పత్రం విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచడంతోపాటు.. రైతు భరోసా ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పడమే ప్రభుత్వ ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో తక్కువ మొత్తం విస్తీర్ణంలో ఉన్న రైతులకు రైతు భరోసా నగదును జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ట్రెజరీ విభాగంలో నెలకొన్న సాంకేతిక లోపాల వల్ల కొంతమంది రైతుల ఖాతాల్లో ఒక రూపాయి మాత్రమే జమయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పైగా నమస్తే తెలంగాణ కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేసిన నేపథ్యంలో రైతు భరోసా డబ్బులు విడుదల వారీగా రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.