సిట్టింగుల మార్పు..?
తెలంగాణలో ప్రస్తుతం బీఆరెస్‌కు 9 మంది సిటింగ్ ఎంపీలు ఉన్నారు. వీరిలో ఆరుగురిని మార్చే యోచనలో గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సిటింగ్‌లకు సీట్లు ఇవ్వడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామనే భావనలో కేసీఆర్ ఉన్నారు. అందుకే సిటింగ్ ఎంపీలలో మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్‌లకు మాత్రం టికెట్ కన్ఫర్మ్ చేశారని సమాచారం. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం నుంచి పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేంద్రంలో హంగ్ వస్తే కీలక భూమిక పోషించవచ్చని ప్రణాళిక వేస్తున్నారు. ఇక సిటింగ్‌లలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, పెద్దపల్లి అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది.
ఓడిన స్థానాల్లో వారికే టికెట్లు..
గత ఎన్నికల్లో బీఆరెస్ ఓడిన స్థానాల్లో ముగ్గురికి కేసీఆర్ టికెట్లు ఓకే చేశారని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ నుంచి వినోద్‌కుమార్, నిజామాబాద్ నుంచి కవితల, ఆదిలాబాద్ నుంచి గోడెం నగేశ్‌కు ఈసారి కూడా టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కవిత, వినోద్‌కుమార్ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి గత ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ పోటీ చేయగా, వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి సాయికిరణ్‌ను పోటీకి దింపాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరడంతో ఈ స్థానంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మల్కాజ్‌గిరి నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన మర్రి రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఇక్కడి నుంచి ఎవరిని నిలపాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి లేదా ఆయన కుమారుడు అమిత్‌రెడ్డిని భరిలో దింపే ఛాన్స్ ఉంది.
మల్కాజ్‌గిరిపై ఫోకస్
బీఆరెఎస్ ఇప్పటివరకు ఒక్కసారి గెలవని లోక్‌సభ స్థానాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆరెఎస్ గెలిచినందునా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ నేతలకు సూచించారు.
మోదీ, సోనియా పోటీ చేస్తే..
మరోవైపు లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై పార్టీ సీనియర్ నాయకులతో కసరత్తు చేస్తున్న కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలపై కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నారు. మోదీ, సోనియా తెలంగాణ నుంచి పోటీచేస్తే అప్పుడు బీఆర్‌ఎస్ ఎలాంటి వ్యూహాంతో ముందుకెళ్లాలనే దానిపై కూడా కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. మహారాష్ట్రలో బీఆరెఎస్‌కు కొంత అనుకూల వాతారణం ఉందన్న భావనలో గులాబీ బాస్ ఉన్నారు. ఆ రాష్ట్రంలో కూడా లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు.