తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2024 ఫిబ్రవరిలో 21నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలో మేడారంలో అభివృద్ధి పనులపై తెలంగాణా సర్కార్ ఫోకస్ పెట్టింది. మేడారం అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ మేడారం వెళ్లి మేడారం జాతర పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఆర్ అండ్ బి, పిఆర్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ డబ్ల్యూఎస్ పనులు త్వరితగతిన చేపట్టి, జనవరి 30 లోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీశాఖ అధికారులు మేడారం వచ్చే దారులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
అన్ని శాఖల వారు చేపడుతున్న పనులకు మనుషులు పెంచి, యంత్ర పరికరాలు పెంచి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జాతరని ప్లాస్టిక్ రహిత జాతరగా, పర్యావరణహితంగా నిర్వహించాలని అన్నారు. ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించినట్లు, కాటన్ సంచులు భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రారంభం నుండే ప్లాస్టిక్ నిషేధాన్ని అమలుచేస్తున్నట్లు, ఫ్లెక్సీలు లేకుండా, పెయింటింగ్, క్లాత్ బ్యానర్లు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
జాతరకు కొత్త శోభ తీసుకొచ్చే ప్రణాళికలు, ప్రయత్నం చేస్తున్నామన్నారు. సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, జాతరకు పక్కా ప్రణాళికతో విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని సివిల్ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్డు నిర్మాణాలు, మరమ్మతులు, విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.
జాతరకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనవరి 30 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్ర స్థాయిలో వుంటూ, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతరను సమిష్టి కృషితో విజయవంతం చేయాలని సూచించారు.