పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. తాజాగా, సోమవారం లోక్‌సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర రావు, కవిత పాల్గొన్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి(BRS) మొదటి జాబితాను ప్రకటించారు పార్టీ అధినేత కేసీఆర్(KCR). నాలుగు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత వెల్లడించారు. కరీంనగర్ నుంచి బీ వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత బీఆర్‌ఎస్ తరఫున బరిలో దిగనున్నారు.
l
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందామని శ్రేణులకు చెప్పారు. నేతలు కలిసికట్టుగా పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతలు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, ఆరోపణలు ప్రారంభమయ్యాయి. అంశాల కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుంది. ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపుదాం. రాబోయే కాలం మనదే అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు కేసీఆర్. గత రెండు రోజులుగా ఆయా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించి, సమష్టి నిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపికైన నలుగురు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. పార్టీ అభ్యర్థులకు అధినేత శుభాకాంక్షలు తెలిపారు.
ఇది ఇలావుంటే, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నేటి సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. ఆయన ఆదివారం కుటుంబసభ్యులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కీలక సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.