TELANGANA

కేసీఆర్ తో ఆర్ఎస్పీ భేటీ.. పొత్తు కోసమేనా..!..

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్పీ కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరి సమావేశం చాలా సేపు జరిగినట్లు తెలుస్తోంది. భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్, బాల్క సుమన్ తో పాటు బీఎస్పీ నేతలతో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఆర్ఎస్పీ, కేసీఆర్ సమావేశంలో ఏం చర్చించారనే దానిపై ఆసక్తి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అప్పుడే చర్చ మొదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి ముందుకెళ్తోంది. బీజేపీ సింగిల్ గానే బరిలో దిగేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ కూడా వీడిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను కూడా ప్రకటించింది.

 

అయితే కలిసొచ్చే పార్టీలను కలుపుకెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒకటి లేదా రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీతో కలిస్తే కాస్త కలిసి వచ్చే అవకాశం ఉందని గులాబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వరకు లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ భేటీ ఆసక్తిగా మారింది.

 

అయితే కేసీఆర్ తో జాగ్రత్తగా ఉండాలని ఆర్ ప్రవీణ్ కుమార్ కు బీఎస్పీ నేతలు సూచిస్తున్నారు. అవసరం తీరక పక్కకు పడేస్తారని చెబుతున్నారు. అటు బీజేపీ కూడా 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భరత్, బీబీ పాటిల్, మాధవి లత ఎంపీ అభ్యర్థులుగా నిర్ణయించింది.