TELANGANA

కేసీఆర్ పార్టీతో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నల్ ..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు కొత్త రాజకీయ పొత్తు ఖరారైంది. బీఆర్ఎస్పార్టీతో పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్‌ చేశారు.

 

బీఆర్ఎస్ పార్టీప్రస్తుతం ఏ కూటమిలోనూ లేనందున మాయావతి పొత్తుకు అంగీకరించినట్లు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు, ఇరు పార్టీల పొత్తుపై త్వరలో కేసీఆర్‌తో తదుపరి చర్చలు ఉంటాయని ప్రవీణ్కుమార్తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్‌తో చర్చలకు ఎంపీ రాంజీ మాయావతి దూతగా వస్తారని ఆయన వెల్లడించారు. ఇటీవల ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన వ్యాఖ్యలతో సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.

 

కాగా, ఇప్పటికే తెలంగాణ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఇటీవల కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుపై చర్చించారు. అప్పుడే పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలోనే బీఎస్పీ అధినేత్రి మాయామవతి కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే సీట్ల పంపకాలపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.