TELANGANA

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. కాగా, టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్ది సేపటికే టెట్ నోటిఫికేషన్ రావడం గమనార్హం.

 

అంతకుముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే టెట్ నోటిఫికేషన్ విడుదలైంది.

 

డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు: దరఖాస్తు గడువు పొడిగింపు

 

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ(DSC) పరీక్షకు తేదీలను ఖరారు చేసింది విద్యాశాఖ. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అయితే, తాజాగా, ఈ తేదీని జూన్ 20 వరకు పొడిగించారు.

 

మొత్తం ఉద్యోగాల్లో 2629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6508 ఎస్జీటీలు ఉన్నాయి. ఇంకా, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా, ఆ తర్వాత ఖమ్మంలో 757, నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

 

తెలంగాణ గ్రూప్-1 దరఖాస్తుల గడువు పొడిగింపు

 

గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

 

బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. షెడ్యూల్ మేరకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.