TELANGANA

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా: ఎందుకంటే..?

ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్ 2వ తేదీకి వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాగా, గత గురువారం ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

 

ఉమ్మడి జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నార. ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను మహబూబ్‌నగర్ బాలుర జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.

 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు.

 

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జూన్ 2వ తేదీన విడుదల కానున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం ఖాయమని టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.