TELANGANA

బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కు చేసినట్టే బీజేపీని చేయాలి..

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని తుక్కుతుక్కు చేసినట్లే దేశంలో బీజేపీని తుక్కుతుక్కుగా తొక్కాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణా నదులు కలిసి తుక్కుగూడలో సునామీ సృష్టిస్తే ఎలా ఉంటుందో అలా ఉందని అన్నారు.

 

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జూన్ 9 ఢిల్లీలో మువ్వెనల జెండా ఎగరాలని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టం వల్ల తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.

 

ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. నమో అంటే నమ్మితే మోసం అని ఎద్దేవా చేశారు. విభజన చట్టం అమలు చేయలేదని.. బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఊసేలేదని అన్నారు.

 

ఇక సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు. తెలంగాణను పట్టి పీడించారన్నారు. ఏది పడితే అది మాట్లాడితే బాగుండదు అని కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. చర్లపల్లి జైలులో కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూం కట్టిస్తామన్నారు. కుటుంబమంతా కలిసి జైళ్లో ఉండేలా డబుల్ బెడ్ రూం కట్టిస్తామన్నారు.

 

హైదరాబాద్‌లో వరదలు వస్తే కిషన్ రెడ్డి ఒక్క రూపాయి అయినా తెచ్చిండా అని మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయనప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.