TELANGANA

తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘం

తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. గత వారం రోజుల నుండి కేసుకు సంబంధించిన పరిణామాలన్నీ కోర్టు చుట్టూనే తిరిగాయి. సిట్ మెమోను ఎసిబి కోర్టు రిజెక్ట్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు. జస్టిస్ నాగార్జున బెంచ్ ముందు ఇప్పటికే వాదనలు ముగిసినప్పటికీ తుది తీర్పు వెల్లడి కావాల్సి ఉంది.. ప్రతిపాదిత నిందితులుగా ఉన్న బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాసులను నిందితులుగా చేర్చాలంటూ సిట్ వేసిన రివిజన్ పిటిషన్ పై తీర్పు రిజ్వర్వ్ లో ఉంచింది హైకోర్టు. మరోవైపు కేసును సిబిఐ చేత విచారించాలని దాఖలైన పలు పిటిషన్ లపై సుదీర్ఘ వాదనలు హైకోర్టులో కొనసాగాయి.

కేసును విచారించే అర్హత , ఏసీబీ పరిధి పై… పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెక్షన్ 17 (b) పిసి యాక్ట్ ప్రకారం 2002లో ఇచ్చిన జీవో అనుసారం మెట్రోపాలిటన్ పరిధిలో ఉన్న ఏసీపి స్థాయి అధికారి పి సి యాక్ట్ కేసులను విచారించవచ్చని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదిస్తూ వచ్చిన మరో జీవోను కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2003 నుండి ఏర్పడ్డ ఏసిబి పరిధిని అందుకు సంబంధించిన జీవోను కోర్టుకు సమర్పించారు. పిసి యాక్ట్ కేసులను కేవలం ఏసీబీ మాత్రమే విచారించాలని పిటిషనర్లు తరపు న్యాయవాదులు వాదించారు.

ఇక ఈ కేసులో లభ్యమైన ఆడియో వీడియో ఫొటోస్ లీకేజ్ పైన హైకోర్టులో ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. కేసు దర్యాప్తు మధ్యలో వుండగానే సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆడియో వీడియోలను రిలీజ్ చేయడంపై తీవ్ర ఆభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్ తరపున న్యాయవాదులు. ఆ వీడియో , ఆడియోలను కోట్ చేస్తూ సిట్ చేస్తున్న దర్యాప్తు తీరును తప్పుపట్టారు . సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేనందునే ఆధారాలన్నీ లీక్ అవుతున్నాయనీ ఆరోపించారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్లు తరఫున అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని వ్యాఖ్యానించింది. శుక్రవారం కేసుకు సంబంధించిన తుది విచారణ జరగనుండగా.. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.