మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు చార్జి షీటులో పేర్కొనబడింది..’ అంటూ ట్వీటేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తాజా చార్జిషీటులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరుని విచారణ సంస్థలు పేర్కొన్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ప్రస్తావించారు’ అని ట్వీట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదు.. ‘రాజగోపాల్ అన్నా.. తొందరపడకు, మాట జారకు.!! 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు’ అంటూ భారత్ రాష్ట్ర సమితి నేత, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాగా, గతంలో తనను లిక్కర్ క్వీన్‌గా అభివర్ణించిన బండి సంజయ్‌ని, కరీంనగర్ సెంటర్‌లో చెప్పుతో కొడతానంటూ కవిత హెచ్చరించిన విషయం విదితమే. రాజగోపాల్ రెడ్డిని మాత్రం ‘అన్నా తొందరపడకు.. మాట జారకు..’ అంటూ పద్ధతిగానే చీవాట్లు పెట్టేందుకు ప్రయత్నించారు కవిత.