న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన క్రమంలో భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మనదేశంలోనే ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీకి జనరల్ ఎలక్ట్రిక్(జేఈ) ఏరోస్పేస్(GE Aerospace)తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) కీలక అవగాహణ ఒప్పందం జరిగింది.
ఈ ఇంజిన్లను భారత వాయుసేనకు చెందిన తేజస్ మార్క్-2 యుద్ధ విమానాల్లో అమరుస్తారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. జీఈ ఏరోస్పేస్‌కు చెందిన ఎఫ్414 ఇంజిన్లను హెచ్ఏఎల్‌త కలిసి భారత్‌లోనే తయారు చేసేందుకు ఒప్పందం కుదిరిందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి కావాల్సిన ఎగుమతి అనుమతులను తీసుకోనున్నట్లు తెలిపింది.
హెచ్ఏఎల్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని భారత్-అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యంలో కీలక ముందడుగుగా అభివర్ణించింది. అంతేగాక, ఇది ఒక చారిత్రక ఒప్పందంగా జీఈ ఏరోస్పేస్ ఛైర్మన్, సీఈవో లారెన్స్ కల్స్ జూనియర్ తెలిపారు. కాగా, ఫైటర్ యుద్ధ విమానాల్లో జెట్ ఇంజిన్లదే కీలక పాత్ర. జెట్ ఇంజిన్ల తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా వద్ద మాత్రమే ఉంది.
దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి అవి అంగీకరించలేదు. రక్షణ పరిజ్ఞానానికి సంబంధించి ఇప్పటి వరకూ అనేక అంశాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించినప్పటికీ.. జెట్ ఇంజిన్ విషయంలో మాత్రం పురోగతి లేదు. ఈ క్రమంలో తాజా ఒప్పందం భారత్‌కు ఎంతో కీలకమని చెప్పవచ్చు.
కాగా, జేఈ-ఎఫ్404 ఇంజిన్ కన్నా.. జేఈ ఎఫ్414 శక్తివంతమైనది. పాతబడిపోతున్న మిరాజ్-2000, మిగ్-29, జాగ్వార్ యుద్ధ విమానాల స్థానంలో ప్రవేశపెట్టిన తేజస్ మార్క్-2 యుద్ధ విమానంలో ఈ ఇంజిన్‌ను అమరుస్తారు. ఎఫ్414 ఇంజిన్.. 1970లలో అభిృద్ధి చేసిన ఎఫ్404 ఇంజిన్‌కు సంబంధించిన కొత్త వెర్షన్. దీని ప్రత్యేకతల దృష్త్యా ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్, ఈఏ-18జీ గ్రౌలర్ సహా అనేక యుద్ధ విమానాలకు దీన్ని ఎంపిక చేశారు.
ఎఫ్404 ఇంజిన్ 90 కిలోన్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జీఈ-ఎఫ్414 ఇంజిన్ దాదాపు 98 కిలోన్యూటన్ల శక్తిని వెలువరిస్తుంది. ఎఫ్414కు తిరుగులేని విశ్వసనీయత ఉంది. ఈ ఇంజిన్లు అమర్చిన విమానాలు కోటి గంటలు గగన విహారం చేయడం గమనార్హం. వీటి నిర్వహణ చాలా సులువు. దీంతో ఖర్చులు కూడా తగ్గుతాయి.