World

మస్క్ మామ మైండ్ బ్లాక్.. రూల్స్ మార్చిన ట్విట్టర్.. !

ట్విట్టర్‌కు పోటీగా మెటా కొత్త యాప్‌ థ్రెడ్స్(Threads)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. థ్రెడ్స్ గురువారం ఉదయం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

ఆండ్రాయిడ్‌, iOS ప్లేస్టోర్‌ రెండింటిలోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. థ్రెడ్స్ వచ్చిన మొదటి రోజే ట్విట్టర్ తన నిబంధనలు మార్చింది. థ్రెడ్స్ రాకతో కంగుతిన్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ రూల్స్ ను మార్చారు. తిరిగి పాత నిబంధనలను తీసుకొచ్చారు.

ట్విట్టర్ లో కొద్ది రోజుల క్రితమే ట్విట్టర్ లాగిన్ అయిన వారు మాత్రమే ఇతరుల పోస్టులు చూసేలా నిబంధనలు తీసుకొచ్చారు. అయితే థ్రెడ్స్ మార్కెట్ లోకి వచ్చిన గంటల వ్యవధిలోనే ఈ నిబంధనను తొలగించారు. లాగిన్ కాకుండా కూడా ట్విట్టర్ పోస్టులు చూడొచ్చని తెలుస్తోంది. దీని కోసం కొన్ని షరతులు కూడా విధించింది. కేవలం ఇతరుల మొదటి ట్వీట్ ను మాత్రమే చూసే అవకాశం కల్పించింది. అయితే దీనిపై ట్విట్టర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే చాలా మంది లాగిన్ అవ్వకుండానే ఇతరల ట్విట్టర్ పోస్టులను చూశారు. దీంతో ట్విట్టర్ పాత రూల్స్ ను తీసుకొచ్చినట్లు స్పష్టమైంది. కానీ చాట్ చేయాలంటే లాగిన్ అవ్వాల్సిందేనని తెలుస్తోంది. లాగిన కాకుండా ఇతరల ట్విట్టర్ పోస్టులు చూడడాన్ని మస్క్ అనవసర పనిగా చెప్పారు. అందుకే లాగిన్ అవ్వకుండా పోస్టులు చూసే నిబంధనను తొలగించారు. కానీ థ్రెడ్స్ రాకతో ఎలాన్ మస్క్ మనస్సు మార్చుకున్నట్లు తెలిసింది.

మెటా థ్రెడ్స్ దెబ్బకు భవిష్యత్ లో ట్విట్టర్ చాలా నిబంధనలు మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే ట్విట్టర్ లో వివిధ రంగుల్లో పెయిడ్ టిక్ మార్కులు తీసుకోచ్చారు. అధికరికంగా టిక్ మార్క్ రావాలంటే డబ్బులు చెల్లించాలని నిబంధన పెట్టారు. వివిధ రకాల వెరిఫైడ్ ఖాతాలకు మూడు రంగుల బ్యాడ్జెస్‌ ఉంటాయి. కంపెనీలకు బంగారం రంగు చెక్ మార్క్‌, ప్రభుత్వ ఖాతాలకు బూడిద రంగు చెక్ మార్క్‌, వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్‌లు నీలం రంగు చెక్ మార్క్‌లో ఉంటాయి.

థ్రెడ్స్ రాకతో ట్విట్టర్ లో టిక్ మార్కు నిబంధనలు కూడా మారే అవకాశం ఉంది. థ్రెడ్స్ యాప్ ను ఇప్పటికే మిలియన్లలో డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ కఠినంగా ఉంటూ.. లాభాల కోసం ట్రై చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అయితే థ్రెడ్స్ ట్విట్టర్ కు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.