ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఉన్నన్ని రోజులూ రోజుకో సంచలనం రేపుతూ నిత్యం వార్తల్లో నిలిచిన ఈ అపర కుబేరుడు..
తాజాగా ఓ కొత్త స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. కార్పొరేట్ సెగ్మెంట్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
భవిష్యత్‌లో మనుషుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చనే అంచనాలు ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పూర్తిస్థాయిలో అడుగుపెట్టారు ఎలాన్ మస్క్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌ను నెలకొల్పారు. దీని పేరు ఎక్స్ఏఐ. టాప్ సెర్చింజిన్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైండ్.. వంటి సంస్థల్లో పని చేసిన కొందరు మాజీ ఉద్యోగులతో కలిసి ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు.
దీని లోగోను కూడా ఆవిష్కరించారు ఎలాన్ మస్క్. యూనివర్శిటీ ఆఫ్ టోరంటో సహకారాన్ని కూడా తీసుకోనున్నారు. ఈ కంపెనీకి ఎలాన్ మస్క్ చీఫ్‌గా వ్యవహరిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను నియంత్రించాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉందంటూ మస్క్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
దీనికి బదులుగా వాస్తవికతను అర్థం చేసుకోవాల్సి ఉందని, అందుకే ఈ కంపెనీని నెలకొల్పినట్లు వెల్లడించారు. ఏఐ బేస్డ్ కంపెనీని నెలకొల్పాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచీ ఉందని, అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని మస్క్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మార్చిలో దీనిపై వర్కవుట్ చేశామనీ వివరించారు.
టెస్లా ఇంటర్నేషనల్ కార్పొరేషన్, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ పెట్టుబడిదారులతో ఈ ఏఐ స్టార్టప్‌కు నిధులు సమకూర్చడంపై చర్చలు జరుపుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఇదివరకే వెల్లడించింది. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్‌విదియా కార్పొరేసన్ నుంచి వేలాది ప్రాసెసర్‌లను కొనుగోలు చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది.