TRENDING

క్లినిక్ లో రూ.85 లక్షల డైమండ్ రింగ్ మర్చిపోయిన మహిళ, చోరీ చేసిన డాక్టర్!

చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ డైమండ్ రింగ్ ను చోరీ చేసిందో వైద్యురాలు. అనంతరం దొరికిపోతాననే భయంతో డాక్టర్ ఆ రింగ్ ను టాయ్ లెట్ కమోడ్ లో పడేసింది.

ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్కిన్ చికిత్స కోసం ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లగా… ఆ సమయంలో బ్రేస్ లెట్, ఉంగరం తీసివేయాలని వైద్యురాలు సూచించారు. చికిత్స తర్వాత మహిళ బ్రేస్ లెట్, రింగ్ మర్చిపోయి వెళ్లిపోయారు. ఆ డైమండ్ రింగ్ ను వైద్యురాలు చోరీ చేసింది. ఇంటికి వెళ్లికా రింగ్ మర్చిపోయానని తెలుసుకున్న బాధిత మహిళ… మళ్లీ వచ్చి అడగ్గా తమకేం తెలియదంటూ సిబ్బంది బుకాయించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి.

పోలీసులకు దొరికిపోతానన్న భయంతో

పోలీసులు విచారణకు రావడంతో ఎక్కడ దొరికిపోతానన్న భయంతో వైద్యురాలు ఉంగరాన్ని టాయ్ లెట్ లో పడేసిందని గుర్తించారు. చివరకు టాయ్ లెట్ కమోడ్ పగులగొట్టి రూ.85 లక్షల విలువ చేసే డైమండ్ రింగ్ ను బయటకు తీశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో ఉండే ప్రముఖ వ్యాపారి నరేంద్ర కుమార్‌ అగర్వాల్‌ కోడలు తనిష్క అగర్వాల్‌… జూన్ 23న జూబ్లీహిల్స్‌ దసపల్లా హోటల్‌ సమీపంలోని ఎఫ్‌ఎంఎస్‌ స్కిన్‌ అండ్‌ డెంటల్‌ క్లినిక్‌కు చికిత్స కోసం వెళ్లారు. ఆ సమయంలో చేతికి ఉన్న ఉంగరంతో పాటు బ్రాస్‌లైట్‌ తొలగించాలని స్కిన్‌ థెరపిస్ట్‌ తనిష్క అగర్వాల్ కు సూచించారు. దీంతో తనిష్క తన రూ.85 లక్షల విలువైన డైమండ్‌ రింగ్‌తో పాటు బ్రాస్‌లైట్‌ తీసి పక్కనపెట్టారు. చికిత్స తర్వాత తన వస్తువులు మర్చిపోయి ఇంటికి వెళ్లారు తనిష్క. ఉంగరం, బ్రాస్‌లైట్‌ కనిపించకపోవడంతో క్లినిక్ లో మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చి వెంటనే తిరిగి వెళ్లారు. అయితే అక్కడ ఉద్యోగులు తమకేంతెలియదన్నారు. దీంతో బాధితురాలు తనిష్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి ఉద్యోగులను విచారించారు. తనిష్కకు చికిత్స చేసిన స్కిన్‌ థెరపిస్ట్‌ ను విచారించారు.

బాత్రూమ్ కమోడ్ లో

పోలీసులకు దొరికిపోతానన్న భయంతో డాక్టర్ తన పర్సులో దాచిపెట్టిన డైమండ్ రింగ్ ను….ఈ నెల 1న బాత్రూమ్ కమోడ్‌లో పడేశారు. పోలీసులు విచారణలో డైమండ్ రింగ్‌ను కమోడ్‌లో పడేసిన విషయాన్ని చెప్పింది. దీంతో పోలీసులు డెంటల్‌ క్లినిక్‌లో ఉన్న బాత్రూమ్ లను తవ్వించి ఆదివారం తెల్లవారుజామున డ్రైనేజీ పైపులైన్‌లో చిక్కుకున్న రింగ్‌ ను బయటకుతీశారు. ఉద్దేశపూర్వకంగా స్కిన్ థెరపిస్ట్ డైమండ్‌ రింగ్‌ను చోరీ చేసినట్లుగా పోలీసుల తెలిపారు.