తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
అయితే మెయిన్ పిల్లర్ గా భావిస్తున్న వర్గాలే ఇప్పుడు సహాయ నిరాకరణ చేస్తున్నాయి. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. అయితే తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. ఇలా వచ్చిన ప్రతిసారి కిందా..మీదా పడుతూ అధిగమిస్తూ వచ్చింది.అయితే సంక్షోభం వచ్చిన ప్రతిసారి… దాని వెనుక నమ్ముకున్న వర్గమే కారణం కావడం విశేషం.
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించినట్లు ఒక స్లోగన్ బలంగా వినిపించింది. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇందులో వాస్తవం ఉండవచ్చు కానీ.. కమ్మ సామాజిక వర్గం అధికారాన్ని దక్కించుకోవడానికే అన్న అపవాదు అయితే ఒకటి ఉంది.అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను చవిచూసింది. దానికి సూత్రధారులుగా కమ్మ సామాజిక వర్గం నేతలే ఉండడం విశేషం. 1984లో నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.ఎన్టీఆర్ తిరిగి అధికారాన్ని పొందగలిగారు.. ప్రజామోదాన్ని పొందారు. 1995లో చంద్రబాబు టిడిపిలో సంక్షోభానికి కారణమయ్యారు. అయితే ఈ ఇద్దరు నేతలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం మద్దతు బలంగా ఉంది. కానీ కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు తెలుగుదేశం పార్టీ పతనాన్ని కోరుకుంటున్నారు. వైసీపీలో ఉంటూ ఎన్ని రకాల విమర్శలు చేయాలో చేస్తున్నారు.ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికైన ఎంపీలు టిడిపికి దూరంగా ఉంటున్నారు. గల్లా జయదేవ్, కేశినేని నానీ లు ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. టిడిపికి అత్యంత బలమైన ప్రాంతాల్లో ఎంపీలు. టిడిపి క్రియాశీలక కార్యక్రమాలకు వీరు దూరంగా ఉండటం కొత్త సంకేతాలను ఇస్తోంది. మీరు కూడా సంక్షోభాలకు కారణమవుతారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందాలని కమ్మ సామాజిక వర్గీయులు బలంగా కోరుతున్నారు. వృత్తిరీత్యా వివిధ దేశాల్లో స్థిరపడిన కమ్మ ప్రముఖులు సంఘటితమవుతున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఈ దశలో పార్టీలో ఉన్న ఆ సామాజిక వర్గం నేతలు ఎందుకు దూరం అవుతున్నారు అన్నది ఆలోచించాల్సిన విషయమే. అయితే దీనికి యువనేత నారా లోకేష్ కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రమేపి పార్టీపై చంద్రబాబుకు పట్టు తప్పుతోందని.. లోకేష్ హ్యాండ్ వార్‌లోకి వస్తుందని.. ఈ క్రమంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఫలితమే.. ఆ నేతల ఎడబాటుకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిని అదునుగా తీసుకుంటున్న వైసీపీ ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తోంది.