AP

గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్

 

పార్వతీపురం మన్యం జిల్లా : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మున్సిపాలిటీలలో అర్హులైన పేదలకు గోధుమపిండి పంపిణీ ప్రారంభం అయింది. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ బుధవారం స్థానిక నాయుడు వీధిలో గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆహార భద్రతకు గోధుమపిండిని ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు రెండు కేజీల గోధుమపిండిని కిలో రూ.16 చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 33,385 రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో 11,827 రేషన్ కార్డులు, పాలకొండలో 7,868, సాలూరులో 13,690 కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్దిదారులకు పారదర్శకంగా గోధుమపిండి పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో డిప్యూటి తహసిల్దార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.