AP

రాజ్యసభ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి…

పెద్దలసభలో తెలుగువారికి మరోసారి ప్రాధాన్యం లభించింది. రెండు కీలకమైన కమిటీలో ఎంపిక వ్యవహారం ఎన్నికలకు దారితీస్తే, ఆ రెండిట్లో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు గెలిచారు. రాజ్యసభ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి. రాజ్యసభ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీల్లో ఇద్దరు తెలుగు ఎంపీలకు అవకాశం దక్కడం విశేషం. మంగళవారం రాజ్యసభ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు కమిటీల్లో ఇద్దరు తెలుగు ఎంపీలకు చోటు చిక్కింది. ఈ ఏడాది మే1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వ తేదీ వరకు రెండు కమిటీలు మనుగడలో ఉంటాయి. పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీలో డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ చోటు దక్కించుకున్నారు. పార్లమెంట్‌ పబ్లిక్ అండర్‌టేక్సింగ్‌ కమిటీలో ఏడుగురు రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ తొమ్మిది మంది అభ్యర్ధుల్లో ముగ్గురు బీజేపీ సభ్యులు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అస్సోం గణ పరిషత్‌ (ఏజీపీ), కాంగ్రెస్‌, బిజూ జనాదళ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ తరఫున ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది బరిలోకి దిగారు.

 

పార్లమెంట్ సభ్యుల అభినందనలు..

సింగిల్‌ ట్రాన్సఫర్‌బుల్‌ ఓటు ప్రాతిపదికన జరిగిన ఈ ఎన్నికలలో రాజ్యసభ సభ్యులు ఒకటి నుంచి ఏడు వరకు ప్రాధాన్యతను వినియోగించుకునే సౌలభ్యం ఉంది. ఓట్ల లెక్కింపులో అత్యధిక తొలి ప్రాధాన్యతా ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌ అభ్యర్ధి సయ్యద్‌ నాజిర్‌ హుస్సేన్‌, బిజూ జనతాదళ్‌ అభ్యర్ధి అమర్‌ పట్నాయక్‌ తొలిరౌండ్‌లో గెలుపొందారు. రెండో రౌండ్లో సీపీఐ అభ్యర్ధి బినయ్‌ విశ్వం గెలవగా ఎన్డీయే బలపరచిన ఏజీపీ అభ్యర్ధి బీరేంద్ర ప్రసాద్‌ బైస్య ఓటమి పాలయ్యారు. మొదటి రౌండ్‌లో గెలిచిన అభ్యర్ధులకు పోలైన రెండవ ప్రాధాన్యతా ఓట్లలో అత్యధికం బినయ్‌ విశ్వంకు రావడంతో రెండవ రౌండ్లో ఆయనకు ఆధిక్యం దక్కింది. మూడవ రౌండ్లో మొదటి రెండు రౌండ్లలో గెలచిన, ఓటమి పాలైన అభ్యర్ధులకు వచ్చిన అదనపు ప్రాధాన్యతా ఓట్లను దక్కించుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్ధి వి.విజయసాయి రెడ్డి, బీజేపీ అభ్యర్ధులు డాక్టర్‌ అనిల్‌ జైన్‌, డాక్టర్‌ రాధామోహన్‌ దాస్‌ అగర్వాల్‌ గెలుపొందారు. మరో బీజేపీ అభ్యర్ధి ప్రకాష్‌ జవడేకర్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్ధి నారాయణ్‌ దాస్‌ గుప్తా మధ్య తీవ్రపోటీ ఏర్పడటంతో వారికి పోలైన ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ఆధారంగా జవదేకర్‌ను అంతిమ విజేతగా ప్రకటించారు.