AP

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పీఏగా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు.

చంద్రబాబుకు ముడుపుల అందటంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేసు విచారణ సమయంలో అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికా వెళ్లారు. నోటీసులు ఇచ్చినా తిరిగి రాకపోవటం తో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు కేసుల విచారణ సమయంలో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెండ్యాల శ్రీనివాస్ పీఏగా పని చేసారు. ఆ సమయంలోనే అమరావతి నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నట్లు శ్రీనివాస్ పైన అభియోగాలు ఉన్నాయి. కొంత కాలం క్రితం ఐటీ అధికారులు శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేయటంతో పాటుగా విచారణ నిర్వహించారు. ఆ సమయంలో ముడుపుల విషయంలో శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఐటీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు అందిన ఐటీ నోటీసులు, స్కిల్ స్కాంలోనూ శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను విచారణ సంస్థలు ప్రస్తావించాయి. దీంతో, స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ వేళ శ్రీనివాస్ అనుమతి లేకుండా అమెరికా వెళ్లారు.

చంద్రబాబు అరెస్ట్ తరువాత సీఐడీ కోర్టులో చేసిన వాదనల్లోనూ శ్రీనివాస్ అంశం ప్రస్తావించారు. శ్రీనివాస్, కిలారి రాజేశ్ విదేశాలకు వెళ్లిపోయారని కోర్టుకు నివేదించారు. శ్రీనివాస్ ప్రభుత్వంలో ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. అమెరికా పరార్ అయిన శ్రీనివాస్ ను తిరిగి శుక్రవారంలోగా తమకు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నోటీసులకు శ్రీనివాస్ స్పందించకపోవటంతో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇక, శ్రీనివాస్ టీడీపీ అధినేత చంద్రబాబుకు నిధులు అందటంలో కీలకంగా వ్యవహరించారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.