AP

సన్నాసి, కుల గుల.. రామోజీపై పోసాని సంచలన ఆరోపణ..

ఏపీలో ఎన్నికలవేళ రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతోంది. ఎన్నికల సమయంలో సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలుంటాయి. అయితే వాటన్నింటికీ భిన్నంగా ఈసారి ఓ పత్రికాధిపతిని వైసిపి నాయకులు టార్గెట్ చేసుకున్నారు. అయితే ఆ పత్రికాధిపతి సామాజిక వర్గానికి చెందిన వారే ఆయనను విమర్శిస్తున్నారు. కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటే ఏపీలో.. ఆ కులం పేరుతోనే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పైగా ఆ పత్రికాధిపతి చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా ఓ వైసిపి నాయకుడు ఓ పత్రికాధిపతి పై చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

 

More

From Ap politics

తెలుగు నాట రామోజీరావు అంటే తెలియని వారుండరు. పచ్చళ్ళు, పేపర్, పైనాన్స్ అనే కాంబినేషన్లలో వ్యాపారాలు ప్రారంభించి కోట్లకు పడగలెత్తాడు. అటువంటి రామోజీరావు తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడు అనే ప్రచారం ఉంది. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో ఆయనకు సపోర్ట్ ఇచ్చాడు. టిడిపి అధికారంలోకి రావడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత అదే రామారావుపై అడ్డగోలుగా రాతలు రాశాడు. అంతేకాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి తెరవెనుక సహాయం చేశాడు అంటారు. అయితే అలాంటి రామోజీరావు ప్రస్థానం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా మసకబారడం ప్రారంభమైంది. ఆ తర్వాత పరిణామాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఏపీలో రెండోసారి ఎన్నికలు జరిగితే వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో తనకు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆయన రివెంజ్ రాజకీయాలకు నాంది పలికారు. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించారు. అంతేకాదు రామోజీరావుకి సంబంధించిన మార్గదర్శి ఫైనాన్స్ సంస్థను చిక్కుల్లోకి నెట్టారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిఐడి అధికారులతో దర్యాప్తు జరిపించారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. అయితే జగన్ తన వ్యాపార కార్యకలాపాల మీద దెబ్బ కొట్టారని ఆరోపిస్తూ.. రామోజీరావు తన పత్రిక ఈనాడులో రాతలు రాయడం మొదలుపెట్టారు. దీనికి సాక్షి పత్రిక ద్వారా ఇప్పిస్తున్నప్పటికీ.. ఎన్నికల సమయంలో ఇది సరిపోదని జగన్ భావించినట్టున్నారు. అయితే ఆయన సామాజిక వర్గానికి చెందిన వారినే రామోజీరావు మీదకి ఉసిగొలుపుతున్నట్టు తెలుస్తోంది.

 

తాజాగా సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి రామోజీరావు మీద తీవ్ర విమర్శలు చేశారు. రామోజీరావుకి కుల పిచ్చి ఎక్కువ అని, ముఖ్యమంత్రి స్థానంలో కమ్మ కులస్తులు మాత్రమే ఉండాలని, అది కూడా తన అడుగులకు మడుగులు వత్తే వారిని మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు రెడ్డి కులస్తులు, కాపు కులస్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే రామోజీరావు జీర్ణించుకో లేడని.. అందుకే తన పత్రికలో విషపు రాతలు రాస్తుంటాడని ఆరోపించారు. గతంలో ఎన్టీ రామారావును పదవి నుంచి అందించడానికి రామోజీరావు తెరవెనుక కృషి చేశారని ఆరోపించారు. ప్రస్తుతం రామోజీరావు పై పోసాని కృష్ణ మురళి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. పోసాని చేసిన ఆరోపణలు చేసిన తాలుకూ వీడియోను వైసిపి నాయకులు తెగ ట్రోల్ చేస్తున్నారు. వారికి తగ్గట్టుగానే టిడిపి నాయకులు కూడా సమాధానాలు ఇస్తున్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఊహించడానికే భయమేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.