AP

టీడీపీలోకి బైరెడ్డి .. చంద్రబాబుతో భేటీకి రంగం సిద్ధం..?

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారతున్నాయి. ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి. దీనిలో భాగంగానే గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో టికెట్ దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో దగ్గరపడటంతో రాజకీయ నేతలు పార్టీ కండువాలు మార్చేస్తున్నారు.

 

ఇప్పటికే అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే రాయలసీమలోని కీలక నేతపై టీడీపీ గురి పెట్టిందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే రాయలసీమ పరిరక్షణ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఆయన ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.

బైరెడ్డి రాజశేఖరరెడ్డిని టీడీపీలోకి తీసుకువచ్చే బాధ్యతను రాయలసీమ నాయకులకు పార్టీ అధినేత అప్పిగించారు. ఈక్రమంలోనే బైరెడ్డి రాజశేఖరరెడ్డితో టీడీపీ నేతలు చర్చలు జరిపారు. బైరెడ్డి సైతం టీడీపీలోకి రావడానికి సముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తనతో పాటు తన కూతురుకు కూడా టికెట్ అడుగుతున్నారు.

 

తనకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్‌తో పాటు, కూతురుకు నంద్యాల ఎంపీ స్థానం కావాలని బైరెడ్డి రాజశేఖరరెడ్డి పట్టుపడుతున్నారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డి అడిగిన స్థానాలపై టీడీపీ అధిష్టానం తర్జన భర్జనలు పడుతున్నారు. ఇప్పటికే ఆయా స్థానాల్లో టికెట్ వస్తుందని భారీగా ఖర్చు పెట్టిన నాయకులకు ఏం సమాధానం చెప్పాలో తెలియని సంకట స్థితిలో చంద్రబాబు నిలిచిపోయారు.

 

వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలోనే బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరాలని భావించారు. కాని కొందరు టీడీపీ నాయకులు అడ్డుపడటంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరకుండా బీజేపీలోని ఉండిపోయారు. తాజాగా ఎన్నికల సమయం దగ్గరపడటంతో తిరిగి బైరెడ్డి రాజశేఖరరెడ్డిని టీడీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలైయ్యాయి.

 

మరి కొద్దిరోజుల్లో బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బైరెడ్డి చంద్రబాబుతో సమావేశం కానున్నారని సమాచారం. బైరెడ్డి గతంలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో టీడీపీని వీడి బీజేపీలో చేరిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి తిరిగి తన సొంత గూటికి చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.