AP

6 గ్యారంటీలు ప్రకటించిన పవన్ కల్యాణ్..

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ.. రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. కొన్ని సీట్లు మాత్రమే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

 

కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయబోతోన్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. ఇక నియోజకవర్గంలో ప్రచారానికి సిద్ధపడుతున్నారు. ఈ నెల చివరివారంలో ఆయన పిఠాపురానికి వెళ్లనున్నారు. వారాహి వాహనంలో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనను చేపట్టనున్నారు.

 

దీనితో పాటు- జనసేన పార్టీ అధినేతగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నారు పవన్ కల్యాణ్. కూటమి బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొననున్నారు. ఎక్కువ భాగం కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధికంగా ఉండే జిల్లాలు కావడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

 

కాగా- పిఠాపురంలో ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి ముందే పవన్ కల్యాణ్ ఆ నియోజకవర్గంపై వరాలను కురిపిస్తోన్నారు. శాసన సభ్యుడిగా తనను ఎన్నుకుంటే ఎలాంటి అభివృద్ధి పనులను చేపడతాననేది ప్రకటించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే వాటిని నెరవేర్చేలా కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలో ఆరు హామీలను ఇచ్చారాయన పిఠాపురం ఓటర్లకు.

 

1. యువత సహా అర్హులైన వారందరికీ ఉద్యోగ అవకాశాల కల్పన 2. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం 3. ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి 4. పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి పర్చడం 5. ఇక్కడి మత్స్యకారులకు ప్రత్యేకంగా జెట్టీల నిర్మాణాన్ని చేపట్టడం 6. కోస్టల్ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి సారించడం- అనే ఆరు హామీలను పవన్ కల్యాణ్ ప్రకటించారు.

 

ఇది తామిచ్చే వాగ్దానమని, తనను గెలిపించుకోవడం పిఠాపురం ప్రజల బాధ్యత అంటూ కొత్త స్లోగన్‌ను తీసుకొచ్చారు పవన్ కల్యాణ్. ఇవే హామీలు, ఇదే నినాదంతో ఆయన పిఠాపురం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి.