AP

పురందేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ కలిశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పురంధేశ్వరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 35 డిమాండ్లతో కూడిన మెమోరాండంను పురందేశ్వరికి అందించారు. ఈ డిమాండ్లలో ఎస్సీ వర్గీకరణ కూడా ఉంది.

 

ఎస్సీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంద కృష్ణకు పురందేశ్వరి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కూడా కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు. ఏపీలో ఎన్డీయేకు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా పురందేశ్వరికి మంద కృష్ణ హామీ ఇచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

 

ఇంతకుముందే చంద్రబాబుతో భేటీ

 

ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును ఆదివారం విజయవాడలోని ఉండవల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించుకున్నారు. ఎన్డీఏలో టీడీపీ చేరికతో ఏపీలో కూటమికి మద్దతివ్వాలని ఆయన తీసుకున్న నిర్ణయం మేరకు చంద్రబాబును కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

 

టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజుకు ప్రత్యామ్నాయం చూడాలని చంద్రబాబును ఆయన కోరారు. అనంతరం మాదిగల అభ్యున్నతికి సహకరించాలని చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం తీసుకుందని మందకృష్ణ తెలిపారు. మాదిగల ఆకాంక్షలను చంద్రబాబు ముందు పెట్టామని, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మొదటి ప్రాధాన్యతలో అవన్నీ నెరవేరుస్తామని, ఎన్డీఏ అధికారంలోకి రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని హామీ ఇచ్చారని మందకృష్ణ మాదిగ వెల్లడించారు.