వివాదాలకు సినీ ఇండస్ట్రీనే కాదు, బుల్లితెర కూడా అతీతం కాదు. కేవలం సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కాదు, బుల్లితెర మీద కాస్త ఫేమ్ సంపాదించిన వాళ్లు కూడా వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు.
తాజాగా ఇలా సరిగమప ద్వారా ఫేమస్ అయిన యసస్వి కొండెపుడి ఇలాంటి ఓ వివాదంలోనే ఇరుక్కున్నాడు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ యసస్వి మీద ఫైర్ అవ్వాల్సినంత వివాదం ఏంటో తెలుసుకుందాం.
యసస్వి కొండెపుడి అనే పేరు రాత్రికి రాత్రే తెలుగు ప్రేక్షకుల్లోకి బాగా చొచ్చుకుపోయింది. సరిగమప సింగింగ్ షోలో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన యసస్వి.. ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే అతడు తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ అతడిని వివాదాల సుడిగుండంలోకి తోసింది. అతడు చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం నడుస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో యసస్వి కొండెపుడి మాట్లాడుతూ.. తాను నవసేవ అనే పేరుతో ఎన్జీవో నడుపుతున్నట్లు 50-60 మంది పిల్లల ఆలన, పాలన చూస్తున్నట్లు వెల్లడించాడు. అయితే అది నిజం కాదని నవసేవ నిర్వాహకులు ఫరా కౌసర్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఫరౌ కౌసర్.. తమ ఎన్జీవో 56మంది పిల్లల ఆలన, పాలన చూస్తోందన్నారు.
తమ ఎన్జీవో పేరుని వాడుకొని, అసత్యాలు ప్రచారం చేసిన యసస్విని క్షమాపణలు చెప్పాలని కోరినా స్పందించలేదని ఫరా కౌసర్ అన్నారు. ప్రేక్షకుల అభిమానం కోసం చేయని పనులను చేసినట్లు ఎలా చెబుతారని మండిపడ్డారు. దీనిపై త్వరలోనే కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్లు ఫరా కౌసర్ వెల్లడించారు. అయితే ఈ వివాదం పై ఇప్పటి వరకు యసస్వి నోరు విప్పకపోవడంతో వివాదం మరింత ముదురుతోంది.